కాకరకాయ (Bitter gourd)

కాకరకాయ (Bitter gourd)

కాకరకాయ


 కాకరకాయలో రెండు రకాలు కలవు. పెద్ద కాకర , పొట్టికాకర అని పిలుస్తారు . పెద్ద కాకర కాయలో రెండురకాలు కలవు. అవి ఆకుపచ్చ కాకర మరియు తెల్లకాకర కాయల రకం ఒకటి . 

    వంకాయలో తెల్ల కాయలు అపథ్యమై ఉండగా కాకర కాయల్లో తెల్లనివి అత్యంత శ్రేష్టమైనవి. కాకరకాయ స్వస్థకరం అయినది. రసాయనిక గుణం కలది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. కాకరకాయలు పైత్యశాంతిని కలిగించును. ఎముకలలో మూలుగుకు బలాన్ని చేకూర్చే గుణం కలదు. 

       కాకరకాయ గురించి ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంధం "సర్వఔషధి గుణకల్పం " ఈవిధంగా వివరిస్తుంది. " కాకర కాయ కొంచం కాకచేయును .సర్వరోగాలను పోగొట్టును . నేత్రాలకు మేలు చేయును . లఘువుగా ఉండును. అగ్నిదీప్తిని ఇచ్చును " అని వివరణాత్మకంగా ఇచ్చెను . మరొక ప్రసిద్ద గ్రంథం " ధన్వంతరి నిఘంటువు " నందు కూడా కాకరకాయ విశేషగుణ ధర్మాల గురించి వివరణలు ఉన్నాయి . దానిలో కాకరకాయ శీతవీర్యం , తిక్తరసం కలిగి ఉండును. గట్టిపడిన మలాన్ని బేధించును. లఘువుగా ఉండి వాతాన్ని కలుగచేయకుండా ఉంటుంది. పెద్దకాకర కొంచం వేడిచేయును . రుచిని పుట్టించి సర్వరోగాలను పోగొడుతుంది . నేత్రాలకు మేలుచేయును . అగ్నిదీపనకరమై ఉండును. అని కాకర యొక్క విశేష గుణాల గురించి వివరించెను . 

      కుక్క , నక్క మొదలగు జంతువులు కరిచినప్పుడు పైకి కట్టడానికి , లోపలికి సేవించడానికి కాకర ఆకు , కాయ , పండు మంచి ఉపయోగకరములై ఉండును . కాకరకాయలు సాలెపురుగు విషాన్ని కూడా విరిచేస్తాయి. కాకర చేదుగా ఉండటం వలన రక్తశుద్ధి చేయును . కాకర కాయల కూర వీర్యస్తంభనమైనది. 

  చర్మవ్యాధులు ఉన్నవారు కాకరకాయను తరుచుగా వాడటం వలన రక్తశుద్ధిని కలుగచేయును . పొడుగు కాకరకాయలు అగ్నిదీప్తిని కలిగించును. లేత కాకరకాయల కూర త్రిదోషాలను హరించును . ముదురు కాయల కూర విరేచనకారి. పొట్టి కాకరకాయలు కూడా ఇంచుమించు ఇదే గుణాన్ని కలిగి ఉండును. కాని ఇవి మిక్కిలి చేదుగా ఉండును. ఆకలిని పుట్టిస్తాయి. 

      కాకరకాయలు ముక్కలుగా కోసి ఎండబెట్టి వరుగు చేసి నిలువచేసుకొంటారు . ఈ వరుగు నేతితో వేయించుకొని తింటే చిరుచేదుగా ఉండి త్రిదోషాలను పోగోట్టును కొన్ని ప్రాంతాలలో కాయలనే కాకుండా పండిన కాకరకాయలు ను కూడా కత్తిరించి వరుగు చేసి నిలువచేస్తారు . ఈ వరుగు కఫవాతాన్ని తగ్గించి పిత్తాన్ని పెంచును. జఠరాగ్ని పెంపొందింపచేయును . కాసను తగ్గించును. రుచిని పుట్టించును. 

     కాకరకాయలను శరీరం నందు వేడి కలిగినవారు వాడకుండా ఉంటే మంచిది . శరీర బలానికి మందు తీసుకునేవారు పెద్ద కాకరకాయతో చేసిన వంటకాలు వాడకూడదు. అలా వాడటం వలన బలం పెంచే మందు శరీరానికి పట్టదు. 

కాకరకాయకు విరుగుడు వస్తువుల్లో ప్రధానం అయినది పులుసు . అందుకే కాకరపులుసు , పులుసుపచ్చడి దోషరహితం అయి ఉంటుంది. కాకరకాయ పులుసుతో పాటు నెయ్యి , ఆవాలు , దోసకాయ కూడా విరుగుడు వస్తువులు . 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *